కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని నిరుపేదల ఉపాధికి ఎలాంటి భంగం కలగకుండా, వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు అతి సమీపంలోనే ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ స్థలాల రక్షణను ప్రాధాన్యతగా తీసుకుంటూనే, ప్రతిష్టాత్మక ఇందిరమ్మ టవర్స్ (Indiramma Towers) నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, హౌసింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన మంత్రి, ‘క్యూర్’ పరిధిలోని నియోజకవర్గాల్లో తొలి విడత నిర్మాణాలకు సంబంధించిన స్థలాల ఎంపికను సత్వరమే పూర్తి చేసి, రాబోయే రెండు, మూడు విడతలకు కూడా భూములను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
క్యూర్ ప్రాంత పరిధిలో మొత్తం లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) వివరించారు. ఇందులో భాగంగా మొదటి విడతలో ప్రతి నియోజకవర్గంలో సుమారు 500 ఇళ్ల చొప్పున బహుళ అంతస్తుల (G+10) ఇందిరమ్మ టవర్స్ (Indiramma Towers) నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. నిరుపేదల ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలిచే ఈ టవర్స్ నిర్మాణంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పారదర్శకంగా పనులు జరిగేలా చూడాలని, భూముల గుర్తింపును యుద్ధప్రాతిపదికన చేపట్టి రెవెన్యూ రికార్డులను సైతం పక్కాగా నిర్వహించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని లబ్ధిదారుల తుది ఎంపికను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఈ సమావేశంలో మంత్రి నిర్ణయించారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేదా అవకతవకలకు చోటులేకుండా, అత్యంత పారదర్శకమైన ‘ఆన్లైన్ డ్రా’విధానం ద్వారా మాత్రమే అర్హులను ఎంపిక చేయనున్నట్లు స్పష్టం చేశారు. సామాజిక న్యాయ సూత్రాలకు కట్టుబడి మహిళలకు, సమాజంలో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ డ్రా నిర్వహిస్తామని, నిరుపేదల కలను నిజం చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.
Also Read : పిచ్చోడి చేతిలో రాయిలా కాంగ్రెస్ పాలన: కేటీఆర్
Follow Us On : WhatsApp

