పొరుగు రాష్ట్రాల పోలీసులతో సమిష్టి పోరుకు సీఎం రేవంత్ పిలుపు

కలం, వెబ్ డెస్క్ : దక్షిణ భారతదేశాన్ని అత్యంత సురక్షితమైన, నేరరహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు పొరుగు రాష్ట్రాల పోలీసు విభాగాలు సమన్వయంతో, సమిష్టిగా కృషి చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా శుక్రవారం జరిగిన ‘దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ’ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏ రాష్ట్రమూ తన సొంత వనరులతో మాత్రమే నేరాలను పూర్తిగా అరికట్టలేదని, సరిహద్దు దాటి పనిచేసే పటిష్టమైన సమన్వయ వ్యవస్థల అవసరం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ అనుసరిస్తున్న సాంకేతిక మౌలిక సదుపాయాలు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఇతర రాష్ట్రాలతో పంచుకోవడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ప్రకటించారు.

శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజా భద్రతకు ప్రభుత్వం కేటాయించే నిధులను ఖర్చుగా కాకుండా మెరుగైన సమాజ నిర్మాణానికి పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని వెల్లడించారు. పరిపాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్‌ను మూడు కమిషనరేట్లుగా విభజించడమే కాకుండా.. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిరోధం, ఆహార కల్తీ నివారణ, జలవనరుల పరిరక్షణ కోసం హైడ్రా , ఈగల్ , టీజీ-సేఫ్ (TG SAFE) వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సైబర్ నేరాల నిరోధంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ప్రశంసలు పొందిందని గుర్తుచేశారు.

అలాగే, నిరంతరం శ్రమించే పోలీసు సిబ్బంది సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు రూ. 1 కోటి నుండి రూ. 2 కోట్ల వరకు ఎక్స్‌గ్రేషియా, ఇంటి స్థలం, కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు హైదరాబాద్‌లో ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్(Young India Police School)’ ప్రారంభించామని వివరించారు. ఈ సదస్సులో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి డీజీపీలు, ఏపీ, కేరళ, లక్షద్వీప్ ఐజీలు/ఏడీజీలతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : ఎండిన పొలంలోనే బైక్‌తో యువరైతు వినూత్న నిరసన!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>