కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామంలోని ‘సరాక’ పరిశ్రమ (Saraka Industry)లో ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పరిశ్రమలోని గ్లాబా బ్లాక్‌లో అకస్మాత్తుగా గ్యాస్ లీకైంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు సుదర్శన్ రావు (27) బాలాజీ (44) గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరికొందరు కార్మికులకు తీవ్ర అస్వస్థత కల్గింది. వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న వెంటనే జిన్నారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గ్యాస్ లీకేజీకి అసలు కారణాలు ఏమిటనే దానిపై పోలీసులు మరియు సంబంధిత శాఖల అధికారులు విచారణ జరుపుతున్నారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

