కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న వేర్వేరు విషాద ఘటనల్లో (Khammam Tragedy) ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద పాతబస్టాండ్‌కు వెళ్లేందుకు కొమ్ము నవీన్ (తల్లంపాడు, ఖమ్మం గ్రామీణ మండలం) గురువారం ఆటో ఎక్కారు. అయితే గమ్యస్థానానికి చేరేలోగానే ఆయనకు గుండెపోటు రావడంతో ఆటోలోనే మృతి చెందారు.
బస్టాండ్‌కు వెళ్లిన తర్వాత ఆటోను ఆపిన డ్రైవర్.. వెనుక సీట్ లో నవీన్ విగతజీవుడిగా పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నవీన్ నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నట్లు సమాచారం ఉండగా, మృతదేహాన్ని సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై ఖమ్మం వన్ టౌన్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
మరోవైపు చర్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. మండల పరిధిలోని చీమలపాడు గ్రామానికి చెందిన ఎల్లబోయిన కామరాజు (45) బుధవారం అర్ధరాత్రి గన్నవరం క్రాస్ రోడ్డు వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ రాజువర్మ తెలిపారు.

