కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో దేవీ శరన్నవరాత్రి వేడుకల ముగింపు సందర్భంగా ఓ ఆసక్తికరమైన, అదే సమయంలో అందరినీ కంటతడి పెట్టించే ఘటన చోటుచేసుకుంది. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో కొలుచుకున్న దుర్గామాతను సాగనంపే సమయం రాగా, అక్కడి చిన్నారుల (Kusumanchi Children) ‘ఎమోషనల్ అటాక్’ అందరినీ భావోద్వేగానికి లోనయ్యేలా చేసింది.
అసలేం జరిగిందంటే..
మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించిన నవరాత్రుల పూజలు ముగియడంతో, ఉత్సవ కమిటీ సభ్యులు దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారి విగ్రహాన్ని వాహనంపైకి ఎక్కించడానికి భక్తులు సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్న కొందరు బుజ్జిగాళ్లు, చిన్నారులు ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.
మా అమ్మను తీసుకెళ్లొద్దు!
తొమ్మిది రోజుల పాటు తమతోనే ఉంటూ, తమకు ఎంతో దగ్గరైన అమ్మవారిని దూరం పెడుతున్నారనేసరికి ఆ చిన్నారి మనసులు తట్టుకోలేకపోయాయి. “అసలు నవరాత్రులు అయిపోయాయంటే మేము ఒప్పుకోం.. అమ్మను ఎక్కడికీ తీసుకెళ్లడానికి వీల్లేదు” అంటూ విగ్రహాన్ని పట్టుకుని అడ్డుపడ్డారు. విగ్రహాన్ని కదిలించకుండా అడ్డుకుంటూ వారు బోరున విలపించారు.
ఎంతమంది సర్దిచెప్పడానికి ప్రయత్నించినా ఆ చిన్నారి గ్యాంగ్ పట్టు వీడలేదు. అమ్మవారిపై పిల్లలకు ఉన్న అమాయకమైన భక్తిని, వారి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి అక్కడున్న స్థానికులు, పెద్దలు ఒక్క క్షణం నిశ్చేష్టులయ్యారు. ఒకవైపు నవ్వు తెప్పించేలా చిన్నారుల ఆ అమాయకపు వాదన ఉన్నప్పటికీ, మరోవైపు వారి కన్నీళ్లు అక్కడి వాతావరణాన్ని తీవ్ర భావోద్వేగంగా మార్చాయి. చివరికి పెద్దలు ఎట్టకేలకు ప్రేమగా నచ్చజెప్పి, సర్దిచెప్పిన తర్వాతే నిమజ్జన కార్యక్రమం ముందుకు సాగింది. ప్రస్తుతం కూసుమంచిలో ఈ చిన్నారి గ్యాంగ్ చేసిన ‘ఎమోషనల్ అటాక్’ సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.

