కేజీబీవీ విద్యార్థులకు నీట్, జేఈఈ కోచింగ్: కలెక్టర్

కలం, యాదగిరిగుట్ట : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత లేకుండా చూడటంతో పాటు, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు భద్రత కల్పించి, ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Anurag Jayanti) క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టారు. బొమ్మలరామారం మండలంలోని సోలిపేట, రామునితండా, మల్యాల గ్రామాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థలను గురువారం సందర్శించి వసతులు, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల అవసరాలపై అధికారులను ఆరా తీశారు.

సోలిపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్.. అంగన్వాడీ భవనం పరిస్థితిని సమీక్షించి, చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ వంటి మౌలిక వసతులపై వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో పాఠశాల వయస్సు గల పిల్లలు ఎంతమంది ఉన్నారు, వారిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది, ప్రైవేట్ పాఠశాలల్లో ఎంతమంది చదువుతున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలను మెరుగుపరచాలని, తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరిగేలా అవగాహన కల్పించి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులను సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రామునితండా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. చిన్నారులకు ఆహారం తయారు చేయడం, పంపిణీ చేయడం సౌకర్యవంతంగా ఉండేందుకు కిచెన్ షెడ్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సురక్షితమైన వాతావరణం కల్పించడంలో నిర్లక్ష్యం వహించరాదని, మౌలిక వసతుల మెరుగుదలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

మల్యాల గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV), జూనియర్ కళాశాల భవనాన్ని పరిశీలించిన కలెక్టర్.. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించే ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. శిక్షణ తరగతుల నిర్వహణకు అవసరమైన గదులు, విద్యార్థుల వసతి, బోధనా సదుపాయాలను పరిశీలించి, పోటీ పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధమయ్యేలా అనుకూలమైన విద్యా వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ, మెరుగైన వసతి సదుపాయాలు అందించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>