కలం, మెదక్ బ్యూరో: రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొద్దునిద్ర పోతున్నారని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువేనని హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. సాగునీరు, విద్యుత్ అందక ఎండిపోయిన వరి పంట పొలాలను సిద్దిపేట (Siddipet) జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పరిశీలించి, రైతులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
కోవిడ్ విపత్తు సమయంలో కేసీఆర్ ప్రజలకు రక్షణ కవచంలా నిలబడి కోటి టన్నుల ధాన్యం పండిస్తే, నేడు రేవంత్ రెడ్డి ఎల్నినో పేరిట క్రాప్ హాలిడే ప్రకటించి రైతులను శిక్షిస్తున్నారని ఆరోపించారు. పది నెలల ముందే శాస్త్రవేత్తలు హెచ్చరించినా బొగ్గు నిల్వలు, విద్యుత్ కొనుగోళ్లు చేపట్టకుండా.. చేతులు కాలాక అధికారులపై చిందులు వేస్తున్నారని ధ్వజమెత్తారు. సస్పెండ్ చేయాల్సింది అధికారులను కాదని, అసమర్థ సీఎంను, విద్యుత్ శాఖ మంత్రినే అని డిమాండ్ చేశారు.
కేసీఆర్కు పేరు వస్తుందనే దుర్బుద్ధితో కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయకుండా, దేవాదుల, కల్వకుర్తి మోటార్లను 24 గంటలు నడపకుండా కుట్రపూరితంగా సాగునీటి కరువును సృష్టించారని ఆరోపించారు. ఈ కరువు కాలంలో ప్రజలపై రూ. 5,420 కోట్ల కరెంటు బిల్లుల భారం మోపడం, ఆర్టీసీ చార్జీలు పెంచడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించాలని, ఎండిపోయిన పంటలకు ఎకరాకు నష్టపరిహారం అందించాలని, అలాగే రైతు కూలీలకు రూ. 12,000 ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు కరువు మండలాలు ప్రకటించలేదని, రైతులకు కనీసం పైసా సాయం కూడా చేయలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతన్నలకు అండగా బీఆర్ పార్టీ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని హరీశ్ రావు (Harish Rao) హెచ్చరించారు.
Also Read : రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై అమిత్ షా సెటైర్లు
Follow Us On : WhatsApp

