కలం, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో దసరా పండుగ వేళ నిర్వహించిన బిన్నీ ఉత్సవం (Devaragattu Banni Utsavam) తీవ్ర హింసాత్మకంగా మారింది. మాలమల్లేశ్వర స్వామి విగ్రహాలను దక్కించుకోవడానికి వివిధ గ్రామస్తులు సాంప్రదాయం ప్రకారం చేపట్టిన కర్రల సమరం రక్తసిక్తమైంది. కర్రల దాడిలో ఒకరు మృతి చెందగా, 100 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు.
అర్ధరాత్రి దాటిన తరువాత కొండపై నుంచి మాలమల్లేశ్వరస్వామి కల్యాణోత్సవ విగ్రహ ఊరేగింపు ప్రారంభమైంది. విగ్రహాలను దక్కించుకునే క్రమంలో ఇరువర్గాలు కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. వందలాది మంది భక్తులు కర్రలు, రాళ్లు, అగ్గి దివిటీలతో విరుచుకుపడడంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ఘటనలో ఆలూరుకు చెందిన పోతురాజు (32) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, 100మందికి పైగా తీవ్ర గాయపడడంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
బిన్నీ ఉత్సవాలకు (Devaragattu Banni Utsavam) భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ వేలాదిమంది భక్తులు తరలిరావడంతో వారిని నిలువరించడం సాధ్యం కాలేదు. కాగా, ప్రతి ఏటా దసరా ఉత్సవాల సందర్భంగా ఈ కర్రల సమరం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. ప్రాణాలు పోతున్నా, తీవ్ర గాయాలపాలవుతున్నా సాంప్రదాయం పేరుతో ఆచారం కొనసాగుతూనే ఉంది.

