కలం, వెబ్ డెస్క్: బెంగళూరులోని కర్ణాటక అసెంబ్లీని పేల్చినట్లు ఏఐ వీడియో (AI Assembly Blast Video) క్రియేట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ కు చెందిన హజరత్ అలీ (25) అసెంబ్లీపై బాంబు దాడి జరిగి పేలిపోయినట్లు కృత్రిమ మేధ ఉపయోగించి ఫేక్ వీడియో సృష్టించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది. కీలకమైన ప్రభుత్వ భవనంపై అసత్య ప్రచారం చేయడంతో పాటు ప్రజల్లో ఆందోళన కలిగించేలా ఈ చర్య ఉండటాన్ని భద్రతా వర్గాలు తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నాయి.
ఈ ఘటనపై వెంటనే స్పందించిన విధానసౌధ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. టెక్నాలజీని ఉపయోగించి ఏఐ వీడియో అప్ లోడ్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే, కేవలం వ్యూస్, లైకుల కోసమే ఈ వీడియో (AI Assembly Blast Video) చేశాడా లేదా మరేదైనా కుట్ర కోణం ఉందా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

