కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామంలో దసరా పండుగ సందర్భంగా జరిగిన ఘర్షణలో యువకుడిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో నలుగురు నిందితులను వలిగొండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 20న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ప్రొద్దుటూరు గ్రామంలోని దసరా పండుగ సందర్భంగా కొందరు యువకులు సౌండ్ బాక్సులతో డ్యాన్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గతంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఏర్పడిన పాత కక్షల నేపథ్యంలో పెద్దబోయిన నవీన్, పెద్దబోయిన అజయ్, పెద్దబోయిన గోపాల్, గజ్జి మహేష్‌లు అక్కడికి వచ్చి సౌండ్ బాక్సులను తన్ని గొడవకు దిగారు అని తెలిపారు.
అనంతరం అదే రాత్రి తిరిగి అక్కడికి వచ్చిన నిందితుల్లో పెద్దబోయిన నవీన్ అను వ్యక్తి కత్తితో పెద్దబోయిన వెంకటేష్‌పై వెనుక భాగంలో పొడవడంతో తీవ్ర గాయం అయినట్లు పేర్కొన్నారు. బాధితుడి తండ్రి పెద్దబోయిన కాంతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను న్యాయస్థానంలో హాజరుపరి, జుడీష్యల్ కస్టడీకి తరలించడం జరిగిందని తెలిపారు.

