కలం, కరీంనగర్ : కరీంనగర్ నగరంలో శ్రీ దుర్గాదేవి(Goddess Durga) శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పలు దుర్గాదేవి మండపాలను, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, దేశం,రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అశోక్ నగర్‌లోని శ్రీ దుర్గా సేవా సమితి, టవర్ సర్కిల్‌లోని ఫ్రెండ్స్ అసోసియేషన్, కమాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవార్లను, నగునూరులోని శ్రీ శ్రీ శ్రీ దుర్గా భవాని ఆలయంలో దుర్గాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్‌తో పాటు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, పలువురు బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

