యాదాద్రి పవర్ స్టేషన్‌లో మరో మైలురాయి

కలం, మిర్యాలగూడ: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మొత్తం 4,000 మెగావాట్ల (5×800 MW) విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో భాగంగా.. ఐదో యూనిట్‌ను బుధవారం ఉదయం 11:06 గంటలకు అధికారులు విజయవంతంగా గ్రిడ్‌కు సింక్రనైజ్ చేశారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే రెండు దశల్లో పనులు చేపట్టగా, మొదటి దశలో రెండు యూనిట్లు (2×800 MW), రెండో దశలో మూడు యూనిట్లు (3×800 MW) నిర్మించారు. ఇందులో ఇప్పటికే 1, 2, 3, 4వ యూనిట్లు పూర్తై వాణిజ్య విద్యుత్ ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. తాజాగా ఐదో యూనిట్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయగా, తదుపరి వాణిజ్య ఉత్పత్తి కార్యకలాపాల నిమిత్తం దీనిని తాత్కాలికంగా ట్రిప్ చేసినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, టీజీజెన్‌కో సీఎండీల దిశానిర్దేశం వల్లే ఈ అరుదైన మైలురాయిని సాధ్యం చేయగలిగామని యాజమాన్యం పేర్కొంది. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న బీహెచ్‌ఈఎల్, టీజీజెన్‌కో ఇంజనీరింగ్ బృందాల సమష్టి కృషిని టీజీజెన్‌కో ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. హరీష్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సింక్రనైజేషన్ కార్యక్రమంలో టీజీజెన్‌కో థర్మల్ & ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వై. రాజశేఖరరెడ్డి, టీపీసీ సీఈ పి.వి. శ్రీనివాస్, వైటీపీఎస్ స్టేజ్-II కన్‌స్ట్రక్షన్ సీఈ జె. సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>