కలం, భువనగిరి: భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని జిల్లా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రాధాన్యత ఇవ్వాలని టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేశ్ వి. పాటిల్ (Jitesh V Patil) సూచించారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవడంతో పాటు నీటి వనరులను కాపాడుకోవడానికి తక్కువ నీటితో పండే వాణిజ్య పంటలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి, చినరావులపల్లి, బట్టుగూడెం గ్రామాలతో పాటు వలిగొండ మండలం మందాపురం గ్రామాల్లో సీఎండీ పర్యటించారు. రైతులతో నేరుగా ముఖాముఖి నిర్వహించి స్థానిక వ్యవసాయ పరిస్థితులు, పంటల విధానం, నీటి లభ్యత, వ్యవసాయ విద్యుత్ అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలు వేయాలని కోరారు. అధిక నీటి అవసరమయ్యే సంప్రదాయ వరి సాగుకు ప్రత్యామ్నాయంగా మునగ, కూరగాయలు, చిరుధాన్యాలు (మిల్లెట్స్) వంటి వాణిజ్య పంటలను ఎంచుకోవాలని సూచించారు. సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు ద్వారా తక్కువ వనరులతో మెరుగైన రాబడి పొందవచ్చని వివరించారు. అలాగే కేవలం పంటలపైనే ఆధారపడకుండా పాడి పరిశ్రమ, మేకల పెంపకం వంటి అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తే రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు.
బోర్వెల్ల ద్వారా నీటిని తోడేందుకు అధిక విద్యుత్ అవసరమవుతున్న దృష్ట్యా, తక్కువ నీటి పంటలతో భూగర్భ జలాలు రక్షణ పొందడమే కాకుండా వ్యవసాయ విద్యుత్ కూడా ఆదా అవుతుందని చెప్పారు. రైతుల్లో ప్రత్యామ్నాయ సాగుపై అవగాహన కల్పించేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎండీ విద్యుత్ అధికారులను ఆదేశించారు. అగ్రికల్చర్ ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను నిశితంగా పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. సాగు సీజన్ ప్రారంభానికి ముందే నిర్వహణ పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

