రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకే ఉమ్మడి పౌర స్మృతి: హనీఫ్ అహ్మద్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: భారతదేశం విభిన్న సంస్కృతులు, ఆచారాలు, ప్రతి వంద కిలోమీటర్లకు మారే వేల భాషల సమాహారం, స్వాతంత్య్ర సమయంలో 565కు పైగా సంస్థానాలు, నాగాలాండ్, త్రిపుర ప్రాంతాలు తమ విశ్వాసాలు, హక్కులకు భంగం వాటిల్లదనే నమ్మకంతోనే యూనియన్‌లో విలీనమయ్యాయనీ తెలంగాణ ఉద్యమకారుడు సామాజికవేత్త హనీఫ్ అహ్మద్ (Hanif Ahmed) తెలిపారు.

బుధవారం మహబూబ్ నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(a) ద్వారా భావప్రకటన స్వేచ్ఛను, ఆర్టికల్ 25 ద్వారా మత స్వేచ్ఛను, ఆర్టికల్ 29, 30 ద్వారా ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, బుద్ధిస్టులు, ఆదివాసులు, గిరిజనులు, ఇతర మైనారిటీల సాంస్కృతిక, విద్యా హక్కులను కాపాడిందని హనీఫ్ అహ్మద్ తెలిపారు.

దేశంలో సివిల్, క్రిమినల్ చట్టాలు అందరికీ సమానమే, ఆచారాల విషయానికొస్తే ముస్లింలకే గాక హిందూ పర్సనల్ లా, క్రైస్తవ, పార్సీ, బుద్ధిస్ట్ చట్టాల ద్వారా అందరి విశ్వాసాలకూ రాజ్యాంగంలో వెసులుబాటు ఉందంటే ఈ ప్రత్యేక చట్టాలను రద్దు చేయాల్సిన పనిలేదనీ ఆయన తెలిపారు. అయితే ఉత్తరాఖండ్, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతిని బలవంతంగా అసెంబ్లీలలో పాస్ చేసి రుద్దుతున్నారని, కేంద్రం కూడా మిగతా రాష్ట్రాలపై దీన్ని రుద్దాలని చూస్తోందని హనీఫ్ అహ్మద్ అన్నారు.

మైనారిటీల హక్కులను దెబ్బతీసే ఈ చర్యలు, నిచ్చెనమెట్ల వ్యవస్థ ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకోవడం ఫెడరలిజానికి, లౌకికత్వానికి, మానవత్వానికి, రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకమని పేర్కొన్నారు. బయట నుండి వచ్చిన ఆర్యన్లు, మనువాదులు మతం పేరుతో రాజకీయం చేస్తూ మత మనువాదాన్ని స్థాపించడానికి మూలవాసులపై కుట్రలు చేస్తున్నారని హనీఫ్ అహ్మద్ మండిపడ్డారు.

తమ మతమే దేశభక్తి అని, మూలవాసులైన మిగతా మతాలు, తెగలు, కులాలకు దేశభక్తి లేదనే విషప్రచారంతో స్వదేశీ పౌరులనే పరాయివారుగా చిత్రించడం, కొద్దిమంది కార్పొరేట్ల కోసం దేశ వనరులను ధారాదత్తం చేయడం, ఈవీఎంలపై అనుమానాలు, చివరికి లా కమిషన్, ప్రభుత్వ రంగాలు, రాజ్యాంగ వ్యవస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తూ తమ గుప్పిట్లో పెట్టుకోవడం ప్రపంచం ముందు మన దేశాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయని స్పష్టం చేశారు.

ఈ ప్రమాదాన్ని గుర్తించి బలవంతపు ఏకపక్ష నిర్ణయాలను పక్కనపెట్టి, రాజ్యాంగ లౌకిక నిర్మాణాన్ని, మూలవాసుల హక్కులను కాపాడటానికి ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, యువత, ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని సామాజిక వేత్త, తెలంగాణ ఉద్యమకారుడు హనీఫ్ అహ్మద్ (Hanif Ahmed) పిలుపునిచ్చారు.

Also Read : ఎల్లుండి ప్రజాభవన్‌లో సీఎం రేవంత్ అత్యవసర భేటీ!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>