కలం, బాసర : బాసర(Basara) శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి పుణ్యక్షేత్రంలో తాత్కాలిక నూతన పోలీస్ స్టేషన్‌ను (Temporary Police Station) జిల్లా ఎస్పీ జానకి షర్మిల మంగళవారం ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి, విస్తరణ మాస్టర్ ప్లాన్ పనుల్లో భాగంగా పాత పోలీస్ స్టేషన్ భవనాన్ని తొలగించిన నేపథ్యంలో, భక్తులకు, స్థానిక ప్రజలకు నిరంతర పోలీస్ సేవలు అందించేందుకు ప్రత్యామ్నాయంగా తాత్కాలిక నూతన పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి విచ్చేసే బాసర క్షేత్రంలో భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ క్రమబద్ధీకరణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, సీఐ రవీందర్ నాయక్, బాసర ఎస్‌హెచ్‌ఓ దీపక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

