కలం, స్పోర్ట్స్ : టీమిండియాలోకి తిరిగి రావాలన్న ఆశ ఇంకా సజీవంగానే ఉందని టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) స్పష్టం చేశాడు. తన ఫిట్‌నెస్‌పై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చాడు. తాను ఇంకా అత్యుత్తమ స్థాయిలోనే ఉన్నానని తెలిపాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌లకు భారత జట్టులో చోటు దక్కకపోయినా.. తన లక్ష్యం మాత్రం మారలేదని వెల్లడించాడు. ఆడుతూనే ఉండటం, ప్రతి మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నాడు.
ఇటీవల భారత జట్టు ఎంపికలో షమీకి మరోసారి నిరాశ ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌ల కోసం ప్రకటించిన జట్లలో అతడికి చోటు దక్కలేదు. దీంతో అతడి ఫిట్నెస్, బౌలింగ్ సామర్థ్యంపై చర్చ మొదలైంది. దేశవాళీ క్రికెట్లో అతడు తక్కువ ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేస్తున్నాడంటూ వచ్చిన విమర్శలపైనా షమీ స్పందించాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి బౌలింగ్ చేయాల్సి ఉంటుందని, బయట నుంచి చూసి ఒక బౌలర్ ఎన్ని ఓవర్లు వేయాలో నిర్ణయించడం సరికాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
మరోవైపు, భారత జట్టులోకి తిరిగి రావడంపై సెలెక్టర్ల నుంచి ఎలాంటి సమాచారం వచ్చిందనే ప్రశ్నకు షమీ స్పష్టమైన సమాధానమిచ్చాడు. ప్రస్తుతం తాను జట్టులో లేనని, కాంట్రాక్టు కూడా లేదని తెలిపాడు. అందువల్ల తనతో సెలెక్టర్లు ఎందుకు మాట్లాడతారని ప్రశ్నించాడు. అయితే, జట్టులోకి రావాలన్న ఆశను మాత్రం వదులుకోలేదని చెప్పాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమని, అందుకే దూర లక్ష్యాల కంటే ప్రస్తుతం ఆడుతున్న మ్యాచ్‌లపై దృష్టి పెట్టాలని భావిస్తున్నాడు.
ఇదే సందర్భంలో భువనేశ్వర్ కుమార్ భారత జట్టులోకి తిరిగి రావడంపై కూడా షమీ స్పందించాడు. భువనేశ్వర్ ప్రదర్శనను బట్టి చూస్తే అతడికి చాలా ముందే జట్టులో అవకాశం రావాల్సిందని అభిప్రాయపడ్డాడు. అతడు క్రికెట్‌కు దూరం కాకుండా నిరంతరం ఆడుతూనే ఉన్నాడని, తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని పేర్కొన్నాడు. భువనేశ్వర్ పునరాగమనం తనకు సంతోషాన్ని కలిగించిందని తెలిపాడు.

