కలం, నర్సాపూర్ (జి): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ (Nirmal) జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో శమీ, ఆయుధపూజ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పెద్ద హనుమాన్ మందిరం ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వయంసేవకులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా వక్త ఉల్లెంగ ముత్యం మాట్లాడుతూ.. విజయదశమి పండుగ విశిష్టతను, ఆర్ఎస్ఎస్ ప్రాధాన్యతను వివరించారు. దేశంలో సానుకూల మార్పు సాధించేందుకు పంచ పరివర్తన ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సామాజిక సామరస్యం, కుటుంబ విలువలు, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ భావన వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా సమాజ అభివృద్ధికి కృషి చేయవచ్చని వివరించారు.
విజయదశమి పర్వదినం ధర్మానికి, విజయానికి ప్రతీకగా నిలుస్తుందని, ఈ సందర్భంగా నిర్వహించే శమీ, ఆయుధపూజలు భారతీయ సంప్రదాయాలు, సంస్కృతికి ప్రతీకలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు పాల్గొన్నారు.

