కలం, కరీంనగర్ బ్యూరో: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని చారిత్రాత్మక, పురాతన గిద్దెపెరుమాళ్ స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కలిసి శమీ పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా త్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. విజయదశమి పర్వదినం సందర్భంగా సర్వేజనా సుఖినోభవంతు అనే ఆకాంక్షతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరికీ విజయం చేకూరాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేస్తున్న ప్రజాప్రతినిధులందరికీ ప్రజాసేవలో మరింత శక్తిని, సామర్థ్యాన్ని ప్రసాదించాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసేలా ఆశీర్వదించాలని భగవంతుడిని కోరుకున్నట్లు చెప్పారు.
ప్రస్తుత ప్రకృతి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చారిత్రాత్మకమైన గుర్తింపు ఉందని, విద్య, వైద్యం, క్రీడలు, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి రంగాల్లో జిల్లా మరింత ప్రగతి సాధించేలా ప్రజాప్రతినిధులందరం సమష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా అగ్రభాగాన నిలిచేలా ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విజయదశమి స్ఫూర్తితో ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపట్టే ప్రతి కార్యక్రమంలో విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి పొన్నం విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

