కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగరంలో దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బొమ్మకల్ లోని శ్రీ యజ్ఞవరాహ స్వామి క్షేత్రంలో శమీ పూజలను అత్యంత నిష్ఠతో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయంలో అర్చకులు జమ్మి చెట్టు వద్ద సాంప్రదాయబద్ధంగా ఆయుధ పూజలు పూర్తి చేశారు. అనంతరం వరాహ స్వామి విగ్రహానికి ఆయుధాలు ధరింపజేసి, నయనమనోహరంగా ‘పారువేట’ ఉత్సవాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరికీ సకల విజయాలు సిద్ధించాలని ఆకాంక్షిస్తూ క్షేత్రంలో ‘అపరాజిత హోమం’ జరిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని, అలాగే ‘ఎల్నినో’ ప్రభావం వల్ల ఎలాంటి వర్షాభావ ఇబ్బందులు ఎదురుకాకుండా కాపాడాలని ఆ యజ్ఞవరాహ స్వామిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కుటుంబ సభ్యులతోపాటు బీఆర్ఎస్ పార్టీ నగరశాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, ఏడవ డివిజన్ నాయకులు గూడెల్లి రాజకుమార్, శ్రావణ్, పలువురు పార్టీ నాయకులు, డివిజన్ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

