కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దంపతులు ఎప్పటిలాగే సొంతూరు నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో దసరా ఉత్సవాలు జరుపుకోనున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి గ్రామంలోని దేవాలయంలో విజయదశమి వేడుకలు జరుపుకోనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామాల్లోని ఆలయాలను పూలతోపాటు విద్యుద్దీప కాంతులతో అలంకరించారు.
మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గ్రామంలో రూ.2.56 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని, రూ.9.5 కోట్లతో చేపట్టిన మురుగు నీటిశుద్ధి కేంద్రాన్ని సీఎం ప్రారంభిస్తారు. రూ. 40 కోట్లతో ఏటీసీ కేంద్ర పనులకు భూమి పూజ చేయనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశమవుతారు. ఈ సమావేశంలో గ్రామ శ్రేయస్సు, అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. సాయంత్రం జమ్మి కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. రాత్రి కొండారెడ్డిపల్లి నుంచి హైదరాబాద్‌కు సీఎం తిరుగు ప్రయాణం అవుతారు.

