కలం, ఖమ్మం బ్యూరో: గ్రామీణ రోడ్ల అనుసంధానం ధ్యేయంగా కొత్తగూడెం నియోజకవర్గంలో రవాణా అభివృద్ధి చేపట్టినట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) స్పష్టం చేశారు. లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మండలాలను అనుసంధానించే రేగళ్ల – కరకవాగు రోడ్డు నిర్మాణ పనులను సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాను ప్రత్యేకంగా చొరవ తీసుకుని రూ.10 కోట్లు మంజూరు చేయించినట్లు వివరించారు.
అయిదు కిలోమీటర్ల మేర రేగళ్ల నుంచి పెద్దతండా, ఉయ్యాల బాడవ, హరియతండా, గేట్ తండా మీదుగా కరకవాగు వరకు రోడ్డు నిర్మాణం సాగుతోందని ఎమ్మెల్యే కూనంనేని తెలిపారు. ఈ నిర్మాణం ద్వారా గిరిజన గూడేలు, తండాలకు ప్రధాన రహదారులతో అనుసంధానం ఏర్పడుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గంలో పల్లె బాటలను వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, తహసీల్దార్ సరిత తదితరులు పాల్గొన్నారు.

