కలం, నిర్మల్ : తెలంగాణ ఆడపడుచులు అత్యంత భక్తిశ్రద్ధలతో, సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు నిమజ్జన ఏర్పాట్లు మాత్రం కరువయ్యాయి. పండుగకు ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిర్మల్ (Nirmal Bathukamma) జిల్లా కేంద్రంలోని ధర్మసాగర్ చెరువు రాణా ప్రతాప్ బతుకమ్మ ఘాట్, కంచరోని చెరువు వద్ద మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు చెరువుల వద్దకు వస్తున్న మహిళలకు అపరిశుభ్ర వాతావరణం, దుర్వాసన స్వాగతం పలుకుతున్నాయి.
చెరువుల్లో గుర్రపుడెక్క.. ఘాట్ల వద్ద అపరిశుభ్రత..
బతుకమ్మ నిమజ్జనానికి కీలకమైన చెరువుల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టాల్సి ఉన్నా, పరిస్థితుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. చెరువుల్లో పిచ్చి మొక్కలు, గుర్రపుడెక్క పేరుకుపోయినా తొలగించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో నిమజ్జనం చేసేందుకు వచ్చే మహిళలు అపరిశుభ్రత, దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగ కోసం ఘనంగా సిద్ధమయ్యే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్ అధికారులు ఎందుకు విఫలమయ్యారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సోషల్ మీడియాలోనూ నిరసన గళం..
నిమజ్జన ఘాట్ల వద్ద నెలకొన్న పరిస్థితులపై కొందరు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు నిమజ్జనం కోసం చెరువుల వద్దకు వస్తుంటారని తెలిసినా, ముందస్తు పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పండుగ తేదీలు ముందే తెలిసినా ఏర్పాట్లలో ఈ నిర్లక్ష్యం ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా స్పందించేనా?
బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీక. అలాంటి పండుగ ముగింపు వేడుకైన నిమజ్జనం సమయంలో మహిళలు ఇబ్బందులు పడాల్సి రావడం ఆవేదన కలిగిస్తోంది. ధర్మసాగర్, కంచరోని చెరువుల వద్ద పేరుకుపోయిన గుర్రపుడెక్క, పిచ్చి మొక్కలను తొలగించి, పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు నిమజ్జన ఘాట్ల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.
నిమజ్జన ఘాట్ల వద్ద ఏర్పాట్లు చేస్తాం..
బతుకమ్మ నిమజ్జన ఘాట్ల వద్ద ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్ రవిబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ను వివరణ కోరగా.. నిర్మల్ పట్టణంలో గురువారం బతుకమ్మ పండుగ ఉన్నందున అప్పటిలోగా చెరువుల వద్ద శుభ్రత పనులు పూర్తి చేసి, ఘాట్ల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. సమయాభావం కారణంగా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయలేకపోయామని పేర్కొన్నారు. పండుగ నాటికి నిమజ్జన ఘాట్లను శుభ్రం చేసి, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

