కలం, కరీంనగర్ బ్యూరో: చెడు మార్గంలో నడిచే వారికి ఎప్పటికీ విజయం లభించదని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా చివరికి అధర్మంపై ధర్మమే విజయం సాధిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) అన్నారు. విజయదశమి పర్వదినం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో (Mahashakti Temple) మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని బండి సంజయ్ దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన చండీ యాగం హోమంలో పాల్గొని భవానీ దీక్షను విరమించారు. అనంతరం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ హిందూ బంధువులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ తెలుగు ప్రజలు దేవీ నవరాత్రి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భారతీయ సంస్కృతిని కాపాడుతున్నారని కొనియాడారు. చెడు మార్గంలో ఉన్నవారు సైతం తమ ప్రవర్తనను మార్చుకుని, ఇతరులకు సేవ చేసినప్పుడే అమ్మవారి కరుణాకటాక్షాలు లభిస్తాయని ఈ సందర్భంగా బండి సంజయ్ స్పష్టం చేశారు.

