కలం, కరీంనగర్ బ్యూరో: హుస్నాబాద్ (Husnabad) నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకను ప్రకటించింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP) పరిధిలోని ఇందిరమ్మ వరద కాలువ ప్యాకేజీ-3 పనులకు సంబంధించి ప్రభుత్వం జీవో నెం.518 ద్వారా సోమవారం కీలక పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) వెల్లడించారు.
రూ.211.172 కోట్లతో ఆమోదం
రైతులకు సాగునీరు అందించడంతో పాటు నీటిపారుదల వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రూ.211.172 కోట్లతో వేరియేషన్ ఎస్టిమేట్-IIకు పరిపాలనా ఆమోదం లభించింది. అలాగే, ఎడమ, కుడి ప్రధాన కాలువల్లో సీసీ లైనింగ్, అదనపు నిర్మాణాల కోసం మరో రూ.40.779 కోట్లతో కొత్త టెండర్లు పిలిచేందుకు ప్రత్యేకంగా అనుమతి మంజూరైందని మంత్రి తెలిపారు.
నియోజకవర్గంలో 38 బ్రిడ్జిల నిర్మాణం
ఎంఎంఆర్ కుడి ప్రధాన కాలువ పరిధిలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో మొత్తం 38 బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్నారు. దీని ద్వారా 22 గ్రామాలకు చెందిన రైతులకు, మొత్తం 24,398 ఎకరాల ఆయకట్టుకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. చిగురుమామిడి మండలంలో ఇందుర్తి, ముదిమాణిక్యం, రామంచ, సీతారాంపూర్, రేకొండ, బొమ్మనపల్లి, పీచుపల్లి, చిన్న ముల్కనూర్ గ్రామాల్లో 19 బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఈ పరిధిలో 5,620 ఎకరాల ఆయకట్టు ఉంది.
సైదాపూర్ మండలంలో దూదేనపల్లి, ఆకునూర్, పేర్కపల్లి, వెంకటేశ్వరపల్లి, ఘన్పూర్, బొమ్మకల్, అమ్మనగుర్తి, ఏక్లాస్పూర్, ఎలబోతారం, గొడిశాల, రాయికల్, సైదాపూర్, సోమారం, వెన్నంపల్లి గ్రామాల్లో మరో 19 బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఈ పరిధిలో 18,778 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ పనులన్నింటినీ ఏడాదిలోపు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
కాలువల పటిష్టతకు ప్రత్యేక టెండర్లు
ఎడమ ప్రధాన కాలువ (ఎల్ఎంసీ), కుడి ప్రధాన కాలువ (ఆర్ఎంసీ) పరిధిలోని సున్నితమైన ప్రాంతాల్లో సీసీ లైనింగ్ పనులు, అదనపు నిర్మాణాల నిమిత్తం రూ.40.779 కోట్లతో కొత్త టెండర్లు పిలువనున్నారు. దీనివల్ల కాలువల పటిష్టత పెరిగి, నీటి సరఫరా మరింత సమర్థవంతంగా జరిగి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పట్టణీకరణ విస్తరణ, గ్రానైట్ క్వారీల ఏర్పాటు వంటి క్షేత్రస్థాయి మార్పులను పరిగణనలోకి తీసుకుని ప్యాకేజీ పరిధిలోని 9,125 ఎకరాల ఆయకట్టును మినహాయించడంతో పాటు, ఒప్పంద విలువను రూ.8.83 కోట్లు తగ్గించినట్లు పేర్కొన్నారు. ఈ పనుల సాంకేతిక మంజూరు, నేల వర్గీకరణ, డిజైన్లు, డ్రాయింగ్ల పరిశీలన, టెండర్ల ప్రక్రియను కరీంనగర్ ఇంజనీర్-ఇన్-చీఫ్ పర్యవేక్షిస్తారని జీవోలో స్పష్టం చేశారు. రైతాంగ సంక్షేమానికి, సాగునీటి రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగేలా నిరంతరం కృషి చేస్తానని ఆయన పునరుద్ఘాటించారు.

