కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనుబంధంగా ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీ దేవీ నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం పర్వతవర్ధిని అమ్మవారు మహిషాసురమర్దినీదేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. దుష్టశక్తులపై దైవశక్తి విజయానికి ప్రతీకగా నిలిచే అమ్మవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఉదయం ప్రాతఃకాల పూజలు, పారాయణాలు, శ్రీ దేవీ మూలమంత్ర జపాలు, సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ దేవీ చతుషష్టి ఉపచార పూజ, నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం నవావరణ పూజ, కుంకుమార్చనలు, సువాసినీ పూజ, కుమారి పూజ తదితర ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

