కలం,మెదక్ జిల్లా: తెలంగాణ గీత కార్మిక సంఘం సంగారెడ్డి (Sangareddy) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద కల్లుగీత కార్మిక సంఘం 69వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గౌడ సంఘం నక్క నాగరాజు గౌడ్ మాట్లాడుతూ… కల్లుగీత కార్మిక సంఘం మొదటినుండి సమరశీల పోరాటం చేస్తుందని, కల్లుగీత కార్మికుల హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తుల సంక్షేమం కోసం గీతా కార్మికుల ఉపాధి కోసం బడ్జెట్లో 5000 కోట్లు కేటాయించాలన్నారు. 50 సంవత్సరాలు నిండిన గీతకార్మికులు రాష్ట్రంలో 37వేల 381 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని.. వీరందరికీ ఎటువంటి షరతులు లేకుండా పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు .
ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినట్లు గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు ఇస్తామని, వృత్తిలో ఆధునీకరణ పద్ధతులు తీసుకువస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీని ఆచరణలో అమలు చేసి చూపాలన్నారు. చెట్ల పెంపకానికి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని, జిల్లా కేంద్రంలో నీరా కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని,పెన్షన్ రూ. 4 వేలు ఇవ్వాలని కోరారు. ఎలాంటి షరతులు లేకుండా రైతుబంధు తరహా లోనే గీతకార్మికులందరికీ ఎక్సిగ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకా రాష్ట్రంలోని గీత కార్మికుల సమస్యలు, పరిష్కరించాలని.. కల్లుగీత వృత్తిని ఆధునికరించాలని, ప్రకృతి సంపదను కాపాడాలని అన్నారు.

