మ‌ద్యం తాగి సింగర్ దలేర్ మెహందీ స్టేజ్ షో!

క‌లం, వెబ్‌డెస్క్: ప్ర‌ముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ (Daler Mehndi)కి ఓ వేదికపైనే ఘోర అవమానం జ‌రిగింది. మద్యం తాగి పాడుతున్నారంటూ ఓ మంత్రి ద‌లేర్ మెహందీపై ఫైర్ అయ్యారు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో జరిగిన ప్రసిద్ధ కుంజాపురి ఉత్సవంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో ఏర్పాటు చేసిన‌ ద‌లేర్ మెహందీ ప్రదర్శన తీవ్ర వివాదానికి దారితీసింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ద‌లేర్ మెహందీ పాటలు పాడుతుండగా.. రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సుబోధ్ ఉనియాల్ హఠాత్తుగా వేదికపైకి దూసుకెళ్లారు. మద్యం మత్తులో దేవి నవరాత్రి వేదికపై ప్రదర్శన ఇవ్వడం తగదని ఆయన బహిరంగంగానే మందలించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించే పవిత్ర సందర్భంలో ఇలాంటి ప్రవర్తన సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “ఇది దుర్గామాత నవరాత్రి కార్యక్రమం.. మీరు మద్యం సేవించి ఈ వేదికపై పాటలు పాడుతున్నారు, ఇది అస్సలు తగదు” అంటూ అందరి ముందూ దలేర్ మెహందీని నిలదీశారు. మిమ్మల్ని పెద్ద పేరున్న గాయకుడిగా గౌరవించి పాట‌లు పాడేందుకు పిలిచాం, కానీ, ఇలా చేయడం ఏంటని మండిపడ్డారు. మంత్రి వ్యాఖ్య‌ల‌తో ద‌లేర్ మెహందీ షాక‌య్యారు. స్టేజీ పైనే చేతులు జోడించి వేడుకుంటూ దయచేసి స్టేజ్ దిగి వెళ్లండి అంటూ మంత్రిని కోరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>