కలం, కరీంనగర్: రాజకీయ లబ్ధి, ప్రచార ఆర్భాటం కోసమే బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణు (Somidi Venu) ఘాటుగా విమర్శించారు. బతుకమ్మ ఏర్పాట్లపై (Bathukamma Arrangements) బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. సోమవారం స్థానిక ఎస్బీఎస్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమిడి వేణు మాట్లాడారు. పండుగ సమయంలో ప్రతిపక్ష నాయకులు ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి, ప్రచారం కోసం అవాస్తవాలు మాట్లాడటం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. గతం కంటే తమ పాలకవర్గం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లను ఎంతో ఘనంగా నిర్వహించిందని స్పష్టం చేశారు.
రూ.3 కోట్లతో 28 బతుకమ్మ పాయింట్ల వద్ద సదుపాయాలు
బతుకమ్మ వేడుకల కోసం రూ.3 కోట్ల నిధులు కేటాయించి, మొత్తం 28 బతుకమ్మ పాయింట్ల వద్ద అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. ఆడబిడ్డలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లైటింగ్, సౌండ్ సిస్టమ్, స్టోన్ డస్ట్‌తో చదును చేయడం, బారికేడింగ్, పారిశుధ్యం, మంచినీటి సదుపాయాలు వంటి అన్ని సౌకర్యాలు కల్పించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిన్నటితో సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రశాంత వాతావరణంలో గొప్పగా ముగించామని వివరించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు తమ పాలకవర్గం, అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయడంలో సంపూర్ణంగా సఫలీకృతమయ్యామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పనులను చూడకుండా, ఉనికి చాటుకోవడం కోసం బీఆర్ఎస్ నాయకులు బురదజల్లే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో దుర్గామాత నిమజ్జన ఉత్సవాలను ఎప్పుడైనా పట్టించుకున్నారా? అని సోమిడి వేణు ప్రశ్నించారు. తమ పాలకవర్గం చరిత్రలో మొదటిసారిగా దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాతల నిమజ్జనానికి కూడా భారీ ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. మానకొండూరు, కొత్తపల్లి చెరువులను ఎంపిక చేసి క్రేన్లు, బారికేడింగ్, తాగునీరు, పారిశుధ్యం వంటి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. గతంలో గణేష్, బతుకమ్మ ఉత్సవాలను నామమాత్రంగా చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
8 నెలల్లోనే వందలాది కోట్ల నిధులు.. అభివృద్ధికి శ్రీకారం
తమ పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే వందలాది కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి నగరంలోని అన్ని రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందని, ఇవన్నీ ప్రజల కళ్లముందే కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకంగా వ్యవహరించడం సిగ్గుచేటని, బతుకమ్మ పండుగను సాకుగా మలచుకుని రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు మేకల వెంకటేష్, ఏపీపీ చంద్ర, మాసం గణేష్, మండన్నా, గజే శివరాం, పవన్ కళ్యాణ్, సాయి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

