కలం, వెబ్ డెస్క్: నకిలీ నెంబర్ ప్లేట్లతో వాహనాలు ఉపయోగిస్తున్నవారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) ఉక్కుపాదం మోపుతున్నారు. గత ఎనిమిది నెలల్లో ఏకంగా వంద మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేశారు. వీటిలో 88 బైక్‌లు, 12 నాలుగు చక్రాల వాహనాలున్నాయి. కొంతకాలంగా సిటీ పోలీసులకు పలు ఫిర్యాదులు అందుతుండటంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. చలాన్ల నుంచి తప్పించుకోవడానికే వీరు నకిలీ నెంబర్ ప్లేట్లను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు వివరించారు.
వాహనదారులకు కీలక సూచనలు..
ప్రతి వాహనదారుడు మోటారు వాహనాల చట్టం–1988, కేంద్ర మోటారు వాహనాల చట్టం–1989 ప్రకారం హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. నకిలీ రిజిస్ట్రేషన్ నెంబర్లు, అనధికార ఫాంట్స్, నెంబరు కనిపించకుండా స్టిక్కర్ల లాంటివి అతికించడం నేరమని స్పష్టం చేస్తున్నారు. ప్రతి వ్యక్తి తాను వాడే వాహనానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన నెంబర్ ప్లేట్‌ను మాత్రమే వాడాలని చెప్పారు. ప్రతి నెంబర్ డేటా బేస్‌లో ఉంటుందని.. నకిలీవి ఉపయోగించి తప్పించుకోవాలనుకుంటే కుదరదని హెచ్చరించారు.

