కలం, నిజామాబాద్ బ్యూరో: వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) పరిధిలో గత 20 సంవత్సరాలుగా వివిధ 78 కేడర్లలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ NHM-JAC ఉద్యోగుల ప్రతినిధులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా వైద్య ఆరోగ్యశాఖలో వివిధ కేడర్లలో సేవలందిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, రెగ్యులరైజేషన్తో పాటు తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి అండగా ఉంటుందని తెలిపారు. NHM ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. NHM-JAC అధ్యక్షులు తల్లపల్లి సుమన్, మారుతి, హరీష్, పద్మజ, సందీప్, మనోజ్ కుమార్,భారత్ కుమార్, ప్రవీణ్, అశ్విని, హరీష్ గౌడ్,అఖిల్ గౌడ్, నవీన్, వేణు మాధవ్, కవిత,స్వరూప, సుజాత, సరిత, ఇంద్ర, స్వప్న, సునీత, యాద్దామా, అన్నపూర్ణ కార్యక్రమంలో ఉన్నారు.

