ఆసియన్ పారా గేమ్స్: మోనా ధమాకా.. భారత్‌కు గోల్డ్!

కలం, స్పోర్ట్స్ : జపాన్‌లోని నాగోయాలో సోమవారం జరిగిన ఆసియన్ పారా గేమ్స్ (Asian Para Games) మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీల్లో భారత షూటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. భారత్‌కు చెందిన మోనా అగర్వాల్ (Mona Agarwal) స్వర్ణ పతకం సాధించగా, అవనీ లేఖరా రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో భారత్ పతకాల బోణీని పసిడి, వెండితో ఘనంగా ప్రారంభించింది. దక్షిణ కొరియాకు చెందిన యున్రీ లీ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఈ పోటీల ఎల్జిబిలిటీ రౌండ్‌లో మోనా అగర్వాల్ 629.1 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఆసియా పారా గేమ్స్ అర్హత రికార్డును నెలకొల్పారు.

అవనీ లేఖరా 626.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. అయితే ఫైనల్ పోరు ఆరంభంలో అవనీ లేఖరా ముందంజలో నిలిచారు. మొదటి పది షాట్ల ముగిసేసరికి అవనీ అగ్రస్థానంలో ఉండగా, మోనా ఆరో స్థానంలో వెనుకబడ్డారు. ఆ తర్వాత ఎలిమినేషన్ రౌండ్‌లో మోనా అద్భుతంగా పుంజుకుని పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకొచ్చారు. చివరి 24వ షాట్ వరకు వీరిద్దరి మధ్య ఉత్కంఠభరితమైన పోరు సాగింది.

ఆఖరి షాట్‌కు ముందు మోనా కేవలం 0.1 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. నిర్ణయాత్మకమైన చివరి షాట్‌లో మోనా 10.8 పాయింట్లు సాధించి, మొత్తం 250.0 పాయింట్లతో ఆసియా పారా గేమ్స్ రికార్డుతో స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నారు. అవనీ లేఖరా 10.5 పాయింట్లు సాధించి, మొత్తం 249.6 పాయింట్లతో రజతంతో సరిపెట్టుకున్నారు. ఈ విజయం ద్వారా 2028 లాస్ ఏంజెల్స్ పారాలింపిక్స్‌ (Asian Para Games) కు అవనీ లేఖరా అర్హత సాధించారు. మోనా అగర్వాల్ గతంలోనే ఈ కోటాను దక్కించుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>