కలం, బాసర : గోదావరి వంతెనపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తిని బాసర (Basara) కు చెందిన ఇద్దరు గ్రామస్తులు సమయస్ఫూర్తితో వ్యవహరించి కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం బాసరకు చెందిన గెంటిల లింబాద్రి, పద్మారావు యంచ గ్రామం నుంచి తిరిగి బాసరకు వస్తున్నారు. ఈ క్రమంలో గోదావరి వంతెనపై ఓ వ్యక్తి నదిలోకి దూకేందుకు ప్రయత్నించడాన్ని వారు గమనించారు. వెంటనే అప్రమత్తమైన ఇద్దరూ క్షణాల్లో స్పందించి, ఆ వ్యక్తిని పట్టుకుని వెనక్కి లాగారు. దీంతో అతడు నదిలోకి దూకకుండా అడ్డుకుని ప్రాణాలు కాపాడారు. అనంతరం ఈ ఘటనపై బాసర పోలీసులకు సమాచారం అందించి, సదరు వ్యక్తిని అప్పగించారు.

