కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రితో పాటు, శ్రీశైలం మల్లిఖార్జున స్వామి దేవాలయం, వరంగల్ భద్రకాళీ అమ్మవారి ఆలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వరాలయం, ఏడుపాయల దుర్గాభవాని ఆలయం, అలంపూర్ జోగులాంబ ఆలయంతో పాటు ప్రముఖ దేవాలయాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా ఇంద్రకీలాద్రిపై భక్తులు పోటెత్తారు. నవరాత్రులు చివరి రోజుకు చేరుకున్న సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తున్నారు. తొమ్మిదోరోజున కనకదుర్గమ్మ శ్రీమహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయం 4 గంటల నుంచే ఆలయ నిర్వాహకులు దుర్గమ్మ దర్శనం కల్పిస్తున్నారు. ఉత్సవాలు చివరిరోజుకు చేరడంతో కొండపైకి భవానీలు భారీగా వస్తారని అధికారుల అంచనా వేస్తున్నారు.
కృష్ణానదీ తీరాన వెలిసిన మరో పుణ్యక్షేత్రం శ్రీశైలంలోనూ తొమ్మిదోరోజు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అమ్మవారు సిద్ధిద్దాయని అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దాదాపు క్యూలైన్లు అన్నీ నిండిపోయాయి. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవ, గ్రామోత్సవం నిర్వహించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

