కలం, వెబ్డెస్క్: హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన భార్య రష్మిక మందన్న (Rashmika Mandanna)తో కలిసి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఈ సెలబ్రెటీ కపుల్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆహ్వానం మేరకు విజయ్, రష్మిక ఈ వేడుకకు హాజరయ్యారు. మంత్రి సీతక్కతో పాటు వేలాది మంది మహిళలతో కలిసి ఈ పూల పండుగలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వరకు సుమారు 1,000 బతుకమ్మలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. 700 మందికి పైగా జానపద కళాకారులు పేరిణి, గుస్సాడి, ఒగ్గుడోలు, డప్పు ప్రదర్శనలు చేశారు. హుస్సేన్ సాగర్ తీరాన లేజర్ షో, బాణసంచా కాల్పులు ఈ వేడుకలను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
ఈ వేడుకల్లో రష్మిక మందన్న సంప్రదాయబద్ధంగా బతుకమ్మను తలపై ఎత్తుకుని, మహిళలతో కలిసి చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా బతుకమ్మ ఆడుతూ అందరిలో ఉత్సాహం నింపారు. రష్మిక , విజయ్ పెళ్లి తర్వాత ఇదే మొదటి బతుకమ్మ పండుగ కావడం విశేషం. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే బతుకమ్మ పండుగలో రష్మిక పాల్గొనడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

