కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని నాయుడువాడ కాలనీలో శ్రీ గుట్ట వీరన్న అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని విశ్వహిందూ పరిషత్ అఖిల భారత సహ కార్యదర్శి, గోరక్ష విభాగం అఖిల భారత ప్రముఖ్ ఆకారపు కేశవరాజు, బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలకు, దేశభక్తికి, ధర్మరక్షణకు, స్వరాజ్య స్థాపనకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన చూపిన పోరాట స్ఫూర్తి, పరిపాలనా దక్షత, ప్రజల పట్ల బాధ్యత నేటి యువతకు ఆదర్శమని అన్నారు. శివాజీ మహారాజ్ ఆశయాలు, స్ఫూర్తిని యువత అలవర్చుకోవాలని సూచించారు.
నిర్మల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే స్ఫూర్తితో ప్రతి గ్రామంలోనూ ఆయన విగ్రహాల ఏర్పాటుకు తన వంతు ప్రోత్సాహం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీరామోజి నరేష్, సాదం అరవింద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

