కలం, హుజూర్నగర్ : మఠంపల్లి మండల పరిధిలోని అమరవరం ఎత్తిపోతల పథకం (Amaravaram Irrigation) పరిధిలో ఉన్న రైతుల సాగునీటి తిప్పలకు తెరపడింది. ఎత్తిపోతల పథకానికి ఏర్పడిన సాంకేతిక లోపాలను సరిచేసి, తిరిగి నీటి సరఫరాను ఆదివారం పునఃప్రారంభించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి నిధుల కేటాయింపు, మరమ్మతు పనులు వేగవంతమయ్యేలా చూడటంతో నీటి విడుదల సుగమమైంది.
సర్పంచులు మాలోతు సక్రు నాయక్, బానోతు అరుణా దేశ్ పాండు నాయక్ స్థానిక రైతులతో కలిసి లిఫ్ట్ ద్వారా సాగునీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఇన్నాళ్లూ నీటి కోసం ఎదురుచూస్తున్న ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అమరవరం లిఫ్ట్ ఇరిగేషన్ ఆధారంగా సుమారు 4వేల ఎకరాల వ్యవసాయ భూమి సాగవుతోంది. ఈ పథకం పునఃప్రారంభం కావడంతో ప్రస్తుత పంట కాలానికి అవసరమైన సాగునీరు పుష్కలంగా అందుతుందని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి ప్రాణాధారమైన నీటి సరఫరా పునరుద్ధరణ జరగడం పట్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
లిఫ్ట్ ఇరిగేషన్ నిరంతరాయంగా పనిచేసేలా నీటిపారుదల శాఖ అధికారులు తరచూ పర్యవేక్షించాలని స్థానిక ప్రజలు, రైతులు కోరారు. భవిష్యత్తులో మళ్లీ ఇటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచులు బాబా, నితిన్, ప్రజాప్రతినిధులు సోముడు, హనుము, వీరారెడ్డి, వెంకట్ రెడ్డి, హనుమా, పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు పాల్గొన్నారు.

