కలం, వెబ్డెస్క్: సద్దుల బతుకమ్మ సందర్భంగా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) వెండి బతుకమ్మ (Silver Bathukamma)తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, బతుకమ్మను కేవలం పూలతోనే పేర్చి సంప్రదాయబద్ధంగా పూజించాలని, ఇలా వెండి బతుకమ్మను వాడటం ఏంటంటూ కొందరు నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించారు. సంప్రదాయాన్ని సరిగా పాటించకుండా తమ పైత్యం పండుగపై రుద్దవద్దంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు మండిపడ్డారు.
నెటిజన్ల విమర్శలపై స్పందించిన పీవీ సింధు తనదైన శైలిలో అందరికీ అర్థమయ్యేలా బదులిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ పోస్టు చేశారు. తెలంగాణకు గుండె కాయ వంటి కరీంనగర్కు చెందిన కుటుంబంలోకి కోడలిగా వెళ్లిన తనకు ఇది తొలి బతుకమ్మ పండగ అని, అలాగే ఫోటోల్లో ఉన్న పెద్ద పూల బతుకమ్మను తానే రోజంతా కష్టపడి అలంకరించానని తెలిపారు. అత్తగారు తనపై ఉన్న ప్రేమతో, తమ కుటుంబ సంప్రదాయంలోకి ఆహ్వానించేందుకే ఆ వెండి బతుకమ్మను బహుమతిగా ఇచ్చారని, ఆ తల్లి ప్రేమకు, ఆప్యాయతకు ఎప్పుడూ విలువ ఉంటుందని సింధు ఎమోషనల్ అయ్యారు.

