కలం, అచ్చంపేట: “తుది శ్వాస వరకు మా గ్రామంలోనే ఉంటాం, గ్రామ అభివృద్ధి కోసం నిరాహార దీక్షలైనా చేస్తాం” అని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని వటవర్లపల్లి (Vatavarlapalli) గ్రామస్తులు ఆదివారం నినాదాలు చేశారు. ఆ గ్రామంలో పునరావాసానికి ఒప్పుకున్న వారితో ఎంఓయూ పై సంతకాలు చేయించుకోవడానికి ఆదివారం అటవీ అధికారులు వటువర్లపల్లి గ్రామానికి వచ్చారు. అటవీశాఖ అధికారుల ముందు అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు పునరావాసానికి మేం అనుకూలంగా లేమని చెప్తూ డీఎఫ్ఓ డౌన్ డౌన్ అంటూ వ్యతిరేక నినాదాలు చేపట్టారు.
వటువర్లపల్లి గ్రామంలో అధికారిక ఘనంకాల ప్రకారం 18 సంవత్సరాలు పై బడిన వారు 1400మంది ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ పునరావాసానికి దరఖాస్తు చేసుకున్న 671 మందిలో కేవలం 240 మంది మాత్రమే ఎంఓయూపై సంతకాలు చేశారని, మిగిలిన వారు ఇకపై ఎవరు సంతకం పెట్టరని వారు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా రేపు కూడా ఈ సంతకాల సేకరణ కొనసాగుతుందని అటవీశాఖ అధికారులు మీడియాకు తెలిపారు. మొత్తానికి ఆ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రోజంతా ఘర్షణ వాతావరణంలో పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సజావుగా జరిగినట్టు అది అటవీశాఖ అధికారులు వివరించారు.

