కలం, దేవరకొండ : దేవరకొండ నియోజకవర్గంలోని ముస్లిం, క్రైస్తవ మైనారిటీ వర్గాల సామాజిక, సాంస్కృతిక వికాసానికి ప్రాధాన్యతనిస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీ హాళ్లను నిర్మించాలని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ (MLA Balu Naik) కోరారు. ఆదివారం రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే, నియోజకవర్గానికి రూ.2.25 కోట్ల నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు.
దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా మైనారిటీల కోసం మొత్తం నాలుగు కమ్యూనిటీ హాళ్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బాలునాయక్ ప్రతిపాదించారు. దేవరకొండ, చింతపల్లి, డిండి ప్రాంతాల్లో ఒక్కో భవనానికి రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.1.50 కోట్లు, క్రైస్తవ మైనారిటీ కమ్యూనిటీ హాల్కు సంబంధించి దేవరకొండలో ప్రత్యేకంగా ఒక భవనం నిర్మాణానికి రూ.75 లక్షలు మంజూరు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ.. మైనారిటీ వర్గాల ప్రజలు సమావేశాలు, సామాజిక-సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యా సంబంధిత అవసరాలు నెరవేర్చుకోవడానికి ఈ కమ్యూనిటీ హాళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో సరైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా మైనారిటీ వర్గాల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు లభిస్తుందని వివరించారు. నియోజకవర్గ ప్రజల అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా ఈ నిధులను త్వరితగతిన మంజూరు చేసి, నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ను ఎమ్మెల్యే కోరారు.

