కలం, సారంగాపూర్: నిర్మల్ జిల్లా ప్రజల ఇలవేల్పుగా, భక్తుల కొంగుబంగారంగా పేరొందిన అడెల్లి శ్రీ మహా పోచమ్మ తల్లి గంగనీళ్ల జాతర (Adelli Pochamma Jatara) మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ముగిసింది. అమ్మవారి ఆభరణాల శోభాయాత్ర, గోదావరి జలాలతో నగల శుద్ధి, ప్రత్యేక పూజలు, భక్తుల జయజయధ్వానాలు, మేళతాళాలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో జాతర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు తెలంగాణలోని పలు జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
శనివారం ఉదయం ప్రారంభమై..
సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయం నుంచి శనివారం ఉదయం ప్రారంభమైన ఆభరణాల శోభాయాత్ర దిలావర్పూర్ మండలం కదిలి, మాడేగాం, దిలావర్పూర్, బన్సపల్లి, కంజర్ గ్రామాల మీదుగా రాత్రికి సాంగ్వి గ్రామంలోని పోచమ్మ ఆలయానికి చేరుకుంది. అమ్మవారి ఆభరణాల వెంట వచ్చిన భక్తులు రాత్రంతా ఆలయ పరిసరాల్లో జాగరణ చేస్తూ అమ్మవారి నామస్మరణలో మునిగిపోయారు. ‘గంగ నీకు శరణమే.. ఘనమైన పూజలే..’ ‘పోచమ్మ తల్లి చల్లంగా చూడమ్మో..’ అంటూ భక్తులు ఆలపించిన భక్తి గీతాలు జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
గోదావరి జలాలతో ఆభరణాల శుద్ధి..
ఆదివారం తెల్లవారుజామున భక్తుల జయజయధ్వానాల మధ్య అమ్మవారి ఆభరణాలను సాంగ్వి నుంచి గోదావరి నది తీరానికి తీసుకెళ్లారు. ఊరి పెద్దలు, ఆలయ పూజారులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారి నగలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పవిత్ర గోదావరి జలాలను గడముంతల్లో తీసుకుని భక్తులు ఆభరణాల వెంట అడెల్లి ఆలయానికి తిరుగు ప్రయాణమయ్యారు.
పసుపు నీళ్లు చల్లుతూ..
సాంగ్వి నుంచి అడెల్లి వరకు సాగిన ఆభరణాల శోభాయాత్రకు కంజర్, బన్సపల్లి, దిలావర్పూర్, మాడేగాం, కదిలి గ్రామాల ప్రజలు మేళతాళాలు, భాజాభజంత్రీలతో ఘన స్వాగతం పలికారు. దిలావర్పూర్ గ్రామానికి చేరుకున్న శోభాయాత్రకు గ్రామస్థులు భారీ పూలతోరణంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి యాటపిల్లలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోగా, భక్తులు దారిపొడవునా అమ్మవారి ఆభరణాలపై పసుపునీళ్లు చల్లుతూ, కొబ్బరికాయలు కొడుతూ తమ భక్తిని చాటుకున్నారు.
ప్రత్యేక పూజలు.. పాలాభిషేకం
సాంగ్వి నుంచి ప్రారంభమైన ఆభరణాల శోభాయాత్ర ఆదివారం సాయంత్రం అడెల్లి దేవస్థానానికి చేరుకుంది. అనంతరం అమ్మవారికి ఆభరణాలను అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో పవిత్ర గంగాజలాలతో ఆలయ శుద్ధి, అమ్మవారి విగ్రహానికి పాలాభిషేకం, పవిత్రోత్సవం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
ఇతర రాష్ట్రాల నుంచి..
అడెల్లి పోచమ్మతల్లిపై ఉన్న అపారమైన విశ్వాసంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి తరలించారు. మహారాష్ట్రలోని యావత్మాల్, నాందేడ్, చంద్రాపూర్ జిల్లాలతో పాటు మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఉదయం ఆలయ కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆభరణాల శోభాయాత్ర మార్గంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

