కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం ఏన్కూరు మండలం నాచారంలోని (Nacharam) వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన, ఆలయానికి వెళ్లే రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసి బహిరంగ సభలో మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి సుమారు రూ.2,500 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా గోదావరి పుష్కరాల నేపథ్యంలో రూ.2,000 కోట్లు, భద్రాచలం దేవస్థానానికి రూ.276 కోట్లు, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి రూ.354 కోట్లు కేటాయించినట్లు వివరించారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా నాచారం ఆలయ రోడ్డును రూ.44 కోట్లతో నిర్మిస్తున్నామని చెప్పారు. అలాగే గన్నవరం, నాచారం, భద్రతండా ప్రాంతాల మీదుగా తల్లాడ–భద్రాచలం ప్రధాన రహదారిని కలిపే మరో బీటీ రహదారిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి కుటుంబం బాగుండటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి రూ.90 వేల కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గత పదేళ్లలో రూ.8.20 లక్షల కోట్ల అప్పుల భారం పడిందని, అసలు, వడ్డీల చెల్లింపులకే ప్రతి నెలా రూ.6,600 కోట్లు వెచ్చించాల్సి వస్తున్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధిని ఆపకుండా కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉన్నందున ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

