గుండ్లపల్లి–పొత్తూరు డబుల్ రోడ్డుకు మోక్షం.. రూ.11 కోట్లు మంజూరు

కలం, కరీంనగర్ : గన్నేరువరం మండల ప్రజలకు బతుకమ్మ–దసరా పండుగల వేళ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న గుండ్లపల్లి–పొత్తూరు డబుల్ రోడ్డు (Gundlapalli–Pottur Double Road) నిర్మాణ పనులకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. అసంపూర్తిగా నిలిచిపోయిన రహదారి పనులను తిరిగి చేపట్టేందుకు ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేయగా, దసరా తర్వాత పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్ సుముఖత వ్యక్తం చేశారు.

పెండింగ్ బిల్లులతో నిలిచిన పనులు

గత ప్రభుత్వ హయాంలో బిల్లులు పెండింగ్‌లో పడటంతో కాంట్రాక్టర్ రోడ్డు పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై వివిధ రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు, అఖిలపక్ష నాయకులు ఆందోళనలు నిర్వహించారు. నిరాహార దీక్షలు చేపట్టడంతో పాటు నిరసనల సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది.

శాసనసభలో ఎమ్మెల్యే గళం

రోజురోజుకూ జటిలంగా మారుతున్న ఈ రహదారి (Gundlapalli–Pottur Double Road) సమస్యను మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై స్పందించిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సప్లిమెంటరీ నోట్ విడుదల చేసి నిధుల మంజూరుకు మార్గం సుగమం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేయడంతో రహదారి నిర్మాణ పనులను తిరిగి చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది.

దసరా తర్వాత పనులు ప్రారంభం

ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం, దసరా తర్వాత పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్ ముందుకు రావడంతో గుండ్లపల్లి–పొత్తూరు డబుల్ రోడ్డు నిర్మాణంపై ప్రజల్లో ఆశలు చిగురించాయి. రహదారి పూర్తయితే ఈ ప్రాంత ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు వాహనదారుల ఇబ్బందులు తగ్గనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>