కలం, వెబ్ డెస్క్: స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఏపీలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా దర్శిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతలు పోలీసులపైనే దాడికి దిగడంతో ఎస్సై ఏడుకొండలు (SI Yedukondalu) తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉందని సమాచారం అందడంతో అప్పటికే అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. ఈ క్రమంలో వైసీపీ నేతలను పోలీసులు అదుపు చేస్తున్న క్రమంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో కొందరు ఎస్సైపై దాడికి దిగడంతో కలకలం రేపింది. దాడి చేసినవారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
నామినేషన్ వేయకుండా అడ్డుకునే కుట్ర..
దర్శి మున్సిపాలిటీకి వైసీపీ అభ్యర్థిగా వెన్నపూస వెంకటరెడ్డిని అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ క్రమంలో తాను నామినేషన్ వేసేందుకు వెళ్లగా టీడీపీ నేతలు దాడి చేసేందుకు యత్నించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను నామినేషన్ వేయకుండా కుట్ర చేస్తూ.. ఎన్నికను ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని విమర్శించారు. ఛైర్మన్ అభ్యర్థిగా తనకు అన్ని అర్హతలున్నా.. ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తక్షణమే ఎన్నికల కమిషన్, కలెక్టర్ జోక్యం చేసుకోవాలని కోరారు.

