కలం, అశ్వారావు పేట : భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా అశ్వారావుపేట (Aswaraopeta) మండలంలో పసుపులేటి నాగ ప్రసాద్ కుటుంబ సభ్యులు మరణం తర్వాత కూడా మానవత్వాన్ని చాటుకున్నారు. ఆ కుటుంబం చూపిన దాతృత్వం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ఆదివారం నాగ ప్రసాద్ అకాల మరణం చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. అయినప్పటికీ ఆ దుఃఖ సమయంలోనూ ఆయన కుటుంబ సభ్యులు ఎంతో ధైర్యంగా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
నాగ ప్రసాద్ నేత్రాలను దానం చేయడానికి వారు ముందుకు వచ్చారు. అరుణాచల శివ సేవా సమితి ఆధ్వర్యంలో పమిడి లక్ష్మణరావు, మానేపల్లి రవీంద్రబాబు, దామెర బాబీ తదితరుల సహకారంతో వైద్య బృందం సకాలంలో నేత్ర సేకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. కుటుంబ సభ్యుల ఈ సత్కార్యం ద్వారా ఇద్దరు వ్యక్తులు అంధత్వాన్ని వీడి మళ్లీ లోకాన్ని చూసే అవకాశం లభించింది.
ఈ సందర్భంగా అరుణాచల శివ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ, సమాజంలో నేత్రదానం (Eye Donation) పై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. మరణానంతరం తమ నేత్రాల ద్వారా ఇతరులకు చూపునిచ్చేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. కష్టకాలంలోనూ బాధ్యతాయుతమైన గొప్ప నిర్ణయం తీసుకున్న నాగ ప్రసాద్ కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.

