కలం, నిజామాబాద్ బ్యూరో : ఇందూరు నగరంలో భక్తిభావం వెల్లివిరుస్తోంది. ఏటేటా దుర్గా మాత మండపాలు రెట్టింపు అవుతున్నాయి.. అంతటా మండపాల్లో ఆలయాల పరిసరాల్లో దుర్గా మాత ను ప్రతిష్టించడం తెలుసు.. కానీ నిజామాబాద్ (Nizamabad) గాయత్రీ నగర్ వాసి తులసీ ప్రసాద్ ఏకంగా ఇంటినే అమ్మ నిలయంగా మార్చేశారు. 2003 నుంచి అమ్మ వారి సేవలో తరిస్తున్నారు. నిజామాబాబ్ కోటగల్లీలో మైసమ్మ ఆలయం పరిధిలో ఆరుగురు స్నేహితులతో మాల ధారణ ప్రారంభించారు.
ఏమాత్రం అనుభవం లేకున్నా అమ్మపై భారం వేసి మాలపూర్తి చేస్తూ వస్తున్నారు.గత ఆరేళ్లుగా శరన్నవరాత్రుల (Durga Navratri) సందర్భంగా తులసి ప్రసాద్ గాయత్రీ నగర్ లోని ఇంట్లోనే అమ్మవారిని ప్రతిష్టిస్తున్నారు. సొంత ఖర్చులతో పెద్ద విగ్రహం ప్రత్యేకంగా తయారు చేయించి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఏటా సొంత ఖర్చులతోనే అన్నదానం నిర్వహిస్తూ భక్తి భావం చాటుతున్నారు.
నిత్యం దుర్గమ్మ పేరు తలచుకుంటూ ఉండేవాళ్ళమని ఆలా మొదలైన మాల అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన తమ జీవితంలో భాగం అయ్యిందని తులసీ ప్రసాద్ చెబుతున్నారు. తమ పిల్లలు జై, చైత్రలు సైతం అలాగే వీధిలో ఉండే పిల్లలు అమ్మ వారి మాలలు వేయడం భక్తిభావం పట్ల పెంచుకోవడం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

