కలం, నిర్మల్ : గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు (వీడీసీ) ఇసుక వేలం నిర్వహిస్తే సహించేది లేదని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వీడీసీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra ) హెచ్చరించారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యాపార సముదాయాలకు తప్పనిసరిగా పార్కింగ్ సదుపాయం ఉండేలా చూడాలన్నారు. పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్లపై ఆక్రమణలు, పశువుల సంచారం, ఇసుక అక్రమ రవాణా తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. పార్కింగ్ సదుపాయం లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగించే వ్యాపార సముదాయాలను గుర్తించి నోటీసులు జారీ చేయాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రధాన రహదారులపై పశువులను వదిలే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశువుల కారణంగా ప్రమాదాలు, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే యజమానులకు జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే పశువులను స్వాధీనం చేసుకోవాలన్నారు. జాతీయ రహదారులు, మున్సిపల్ పరిధిలోని ప్రధాన రహదారులపై ఉన్న ఆక్రమణలను గుర్తించి తొలగించాలని అధికారులను ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ‘బ్లాక్ స్పాట్లు’గా గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన హెచ్చరిక బోర్డులు, ఇతర భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, వెంకట మాధవ రావు, అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీసాయి కిరణ్, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

