కలం, స్పోర్ట్స్: “వినేషియస్ స్థానంలో నేను ఉండి ఉంటే ఈ వేసవిలోనే క్లబ్ను వదిలేసి వెళ్ళిపోయేవాడిని” అని రియల్ మాడ్రిడ్ కోచ్ జోస్ మురిన్హో (Jose Mourinho) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వారాంతంలో విల్లారియల్తో జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థి ఆటగాడి జుట్టు పట్టుకుని లాగినందుకు వినీషియస్ జూనియర్ రెడ్ కార్డ్ ఎదుర్కొన్నారు. దీంతో లా లీగా ఆయనపై నాలుగు మ్యాచ్ల నిషేధం విధించింది.
ఈ నిషేధం వల్ల అక్టోబర్ 25న బార్సిలోనాతో జరగబోయే అత్యంత కీలకమైన ‘ఎల్ క్లాసికో’ మ్యాచ్కు వినీషియస్ దూరం కానున్నారు. 2018లో రియల్ మాడ్రిడ్లో చేరినప్పటి నుండి ఆయన నిరంతరం ప్రత్యర్థి అభిమానుల నుండి జాత్యహంకార వ్యాఖ్యలను, వేధింపులను ఎదుర్కొంటున్నారు. వినీషియస్ ఎంతో అద్భుతమైన ఆటగాడని మురిన్హో కొనియాడారు. ఇన్ని వివాదాలు, వేధింపులు చుట్టుముట్టినా ఆయన ముఖంలో నవ్వు చెదిరిపోకపోవడం గొప్ప విషయమన్నారు. ఆటగాళ్లను గౌరవించే వేరే లీగ్కో లేదా దేశానికో తాను వెళ్లిపోయేవాడినని చెప్పారు.
అయితే, రియల్ మాడ్రిడ్ క్లబ్పై ఉన్న అమితమైన ప్రేమతోనే వినీషియస్ 2032 వరకు ఇక్కడే ఉండేలా కొత్త ఒప్పందం చేసుకున్నారని స్పష్టం చేశారు. క్రమశిక్షణా కమిటీ మరింత ఎక్కువ శిక్ష విధిస్తుందని భావించానని, ఈ నాలుగు మ్యాచ్ల నిషేధమే కాస్త ఊరటనిచ్చిందని మురిన్హో వ్యాఖ్యానించారు. మరొకవైపు లా లీగా అధ్యక్షుడు జావైర్ టెబాస్ వివాదంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. క్లబ్ ప్రతిష్ట దెబ్బతినకుండా ఈ వివాదాలకు ఇక్కడితోనే స్వస్తి చెప్పడం మంచిదని ముగించారు.

