కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palvancha) నవభారత్ హెచ్పీ గ్యాస్ మేనేజర్ లక్ష్మీనారాయణ భద్రాచలంలోని ఓ లాడ్జిలో శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కార్యాలయంలోని ఉద్యోగుల వేధింపులు, కొందరు మీడియా ప్రతినిధుల ఒత్తిళ్ల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన రాసిన సూసైడ్ నోట్లో స్పష్టం చేశారు.
ఆఫీసులో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న ఓ మహిళ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల పేరుతో అదనపు సంపాదనకు అవకాశం ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చిందని, దీంతో తాను సెలవుపై వెళ్లాల్సి వచ్చిందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సెలవు ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత.. తనను బదిలీ చేయాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వినియోగదారుల వద్ద అదనపు వసూళ్లు చేయాలని సదరు మహిళతోపాటు కొందరు తనను వేధించారని ఆరోపించారు. అక్టోబర్ 28న ఆఫీసుకు వచ్చి సిబ్బంది ముందే దూషించి బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు.
తాను నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ.. సదరు మహిళ తనపై సెప్టెంబర్ 30న జిల్లా కలెక్టర్కు లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయగా, అక్టోబర్ 16న అంతర్గత కమిటీ విచారణ జరిపింది. ఈ విచారణను, వివాదాన్ని అడ్డం పెట్టుకుని ఆ మహిళ, ఆమె భర్త, కొంతమంది రిపోర్టర్లు సోషల్ మీడియాలో, వార్తా పత్రికల్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తూ మనస్తాపానికి గురిచేశారని లక్ష్మీనారాయణ తన లేఖలో పేర్కొన్నారు. తన మృతికి వీరే కారణమని స్పష్టం చేస్తూ ఆయన ప్రాణాలు వదిలారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో మరిన్ని నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

