కలం, యాదాద్రి భువనగిరి: కోర్టు కేసుల్లో నేర నిరూపణ శాతం పెంచడంతో పాటు పెండింగ్లో ఉన్న సమన్లను త్వరితగతిన పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ (SP Akshansh Yadav) పోలీస్ అధికారులను ఆదేశించారు. భువనగిరి డీఏఆర్ హెడ్క్వార్టర్స్లో శనివారం నిర్వహించిన కోర్టు సమన్వయ సమావేశంలో ఆయన కేసుల పురోగతి, ఈ-సమ్మన్ల అమలు, ఈ-సాక్ష్యా నివేదికలపై సమీక్షించారు. రాజాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేశవ్ రెడ్డిని ఎస్పీ సన్మానించి అభినందించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సీడీఓ వీరారెడ్డిని కూడా ప్రశంసించారు.
పోలీస్ స్టేషన్ల వారీగా సమన్ల అప్డేటింగ్, పెండింగ్ సమన్లు, కోర్టు కేసుల స్థితిగతులను సమీక్షిస్తూ, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో పాయింట్ బుక్స్ను క్రమం తప్పకుండా పరిశీలించాలని, ఎంఓ నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. పునరావృత నేరాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణతో పాటు డీఎస్పీలు, సీఐలు, ఎస్హెచ్ఓలు, టెక్ టీమ్ సిబ్బంది, సీడీఓలు, కోర్టు లైజన్ అధికారులు పాల్గొన్నారు.

