కాంగ్రెస్ హ‌యాంలోనే ఈసీ దుర్వినియోగం: డీకే అరుణ

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: దేశాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ విదేశీ శక్తులతో చేతులు కలుపుతోందని, దేశ సమగ్రతను దెబ్బతీసే కుట్రలకు పాల్పడుతోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థికంగా, అభివృద్ధిపథంలో ముందుకు సాగుతుండటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తుల ప్రయత్నాలను చూస్తూ ఊరుకోబోమని ఎంపీ డీకే అరుణ హెచ్చరించారు. శనివారం మహబూబ్‌న‌గ‌ర్‌ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు విదేశీ కుట్రలు జరుగుతున్నాయని, 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విదేశీ కుట్రల్లో రాహుల్ గాంధీ పావుగా మారుతున్నారా, లేక వాటిలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారా అనేది అర్థం కావడం లేదన్నారు.

రాహుల్ చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాలే..

దేశ విచ్ఛిన్నకర శక్తులతో ప్రతిపక్షాలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం చేతులు కలపడం బాధాకరమని పేర్కొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ, ఓట్ల తొలగింపు పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 13 కోట్ల ఓట్లు తొలగిస్తున్నారంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారం అసత్యమని విమర్శించారు. ఎన్నికల సంఘం గుర్తించిన వివరాల ప్రకారం 2.80 కోట్ల మంది మరణించిన ఓటర్లు, 6.30 కోట్ల మంది శాశ్వతంగా చిరునామా మార్చుకున్నవారు, కోటి మంది డూప్లికేట్ ఓటర్లుగా గుర్తించబడ్డారని పేర్కొన్నారు. అర్హత ఉన్న వ్యక్తి ఓటు నమోదు కాకపోతే ఫామ్-6 ద్వారా తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.దేశంలో ఓటరు జాబితా సవరణ తొలిసారి జరుగుతున్న ప్రక్రియ కాదని, గతంలో ఎనిమిదిసార్లు సవరణలు జరిగాయని డీకే అరుణ తెలిపారు. వాటిలో అత్యధికంగా ఆరుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి పేర్లను గుర్తించి జాబితాను ప్రక్షాళన చేయడమే ఈ ప్రక్రియ ఉద్దేశమని వివరించారు. ఎన్నికల సంఘం వ్యవస్థను కాంగ్రెస్ గతంలో దుర్వినియోగం చేసిందని డీకే అరుణ ఆరోపించారు. ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన ఆర్‌కే త్రివేది, టీఎన్ శేషన్, ఎంఎస్ గిల్‌లకు కాంగ్రెస్ పాలనలో వివిధ పదవులు లభించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆర్‌కే త్రివేది గుజరాత్ గవర్నర్‌గా, టీఎన్ శేషన్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయగా, ఎంఎస్ గిల్‌కు రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్ర మంత్రిపదవి లభించాయని పేర్కొన్నారు. గతంలో ఓటరు జాబితా సవరణలు జరిగినప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేయని కాంగ్రెస్ ఇప్పుడు అదే ప్రక్రియపై విమర్శలు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు.

ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎలా విజయం సాధించిందో సమాధానం చెప్పాలని డీకే అరుణ ప్రశ్నించారు. కేరళలో సర్ ప్రక్రియతో నకిలీ ఓట్లు తొలగిపోవడం కాంగ్రెస్‌కు మేలు చేసిందని అక్కడి కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల పేర్కొన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారిని గుర్తించి తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ చెప్పిన వ్యాఖ్యలను కూడా గుర్తుచేశారు. ఢిల్లీలో డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని 2015లో అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు ఓటరు జాబితా ప్రక్షాళనను వ్యతిరేకించడం ఏమిటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పరిపక్వత లేని నాయకుడిలా వ్యవహరిస్తున్నారని డీకే అరుణ విమర్శించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ భారత ప్రధాన న్యాయమూర్తి సహా కీలక వ్యవస్థల అధిపతులు రాజీనామా చేయాలని కోరడం సరైన విధానం కాదన్నారు. కేవలం అధికారం కోసం దిగజారి వ్యవహరించవద్దని రాహుల్ గాంధీకి సూచించారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు జరుగుతోందా లేదా అన్న విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీట్‌పై జరిగిన నిరసనలకు దేశవ్యతిరేక శక్తులు నిధులు సమకూర్చాయని ఆమె ఆరోపించారు. దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పద్మజ రెడ్డి, కార్యవర్గ సభ్యులు రతంగ్ పాండు రెడ్డి, జనార్దన్ రెడ్డి, రఘురామయ్య, కార్పొరేటర్లు కిరణ్ కుమార్ రెడ్డి, రమేష్,పాండు రంగారెడ్డి, జ్యోతితో పాటు జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>